Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో భారీగా పెరిగిన ఆటో ఛార్జీలు.. 12 ఏళ్ల తర్వాత పెంపు

Telangana auto rickshaw charges increased significantly hike after 12 years
Advertisement
  • తెలంగాణలో 12 ఏళ్ల తర్వాత సవరించిన ఆటో ఛార్జీలు
  • కనీస ఛార్జీ రూ. 30, ఆ తర్వాత కిలోమీటరుకు రూ. 14గా నిర్ధారణ
  • రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఒకటిన్నర రెట్లు అధిక ఛార్జీ
  • మూడు నెలల్లో మీటర్లు మార్చాలని డ్రైవర్లకు ఆదేశాలు
  • పెరిగిన ఖర్చుల దృష్ట్యా ప్రభుత్వ కమిటీ సిఫారసులతో నిర్ణయం
Advertisement
తెలంగాణలో సామాన్యులపై మరో భారం పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఆటో రిక్షా ఛార్జీలను పెంచుతూ రవాణా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత ఈ ఛార్జీలను సవరించడం గమనార్హం. నూతన ఛార్జీల ప్రకారం, కనీస ఛార్జీని (తొలి 1.6 కిలోమీటర్లకు) రూ.30గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రయాణించే ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.14 చొప్పున వసూలు చేయనున్నారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం, రాత్రి సమయ ఛార్జీలను కూడా సవరించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య సాధారణ ఛార్జీపై ఒకటిన్నర రెట్లు అధికంగా వసూలు చేస్తారు. ప్రయాణికుల కోసం వేచి ఉండే సమయానికి (వెయిటింగ్ ఛార్జీలు) నిమిషానికి 75 పైసలుగా ఖరారు చేశారు. 

ప్రస్తుతం ఉన్న డిజిటల్ మీటర్లను కొత్త ఛార్జీలకు అనుగుణంగా మార్చుకునేందుకు ఆటో డ్రైవర్లకు మూడు నెలల గడువు ఇచ్చారు. ఈలోగా పాత, కొత్త ఛార్జీల వివరాలతో కూడిన టారిఫ్ కార్డులను ఆటోల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది.

చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో 2014 ఫిబ్రవరిలో ఆటో ఛార్జీలను సవరించారు. వాహనాల కొనుగోలు వ్యయం, ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులు, బీమా, డ్రైవర్ల జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఛార్జీలు పెంపును సిఫారసు చేస్తూ ప్రభుత్వ నియమించిన కమిటీ నివేదిక సమర్పించింది. ఈ సిఫారసుల మేరకే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో, టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల కోసం కామన్ పాస్‌ను ప్రారంభించిన రోజే ఈ ఛార్జీల పెంపు ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.
Advertisement
Advertisement
Telangana Auto Rickshaw Charges
Auto Fare Hike Telangana
Telangana Transport Department

More Telugu News